రివ్యూ: W/O రామ్

రివ్యూ: W/O రామ్


wife-of-ram-movie-review-and-rating

 

రివ్యూ:W/O రామ్


రేటింగ్‌: 2.5/5
తారాగణం: మంచు లక్ష్మీ,సామ్రాట్ రెడ్డి,ఆదర్శ్ బాలకృష్ణ,ప్రియదర్శి
సంగీతం: రఘు దీక్షిత్
నిర్మాత: వివేక్ కూచిభొట్ల
దర్శకత్వం: విజయ్ ఏలకంటి


 

ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీ, కాసింత కామెడీ.. యూత్‌ను రప్పించడానికి మసాలా ఐటమ్ సాంగ్.. సినిమా అనగానే సగటు తెలుగు ప్రేక్షకుడి మదిలో మెదిలే ఆలోచన ఇది. ఈ రొటీన్ ఫార్ములాతోనే సినిమాలు తెరకెక్కడమే దీనికి కారణం. కానీ ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు కొత్త రక్తం దూసుకొస్తోంది. సందీప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి యువ దర్శకులు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

తెలుగు సినిమా అవధులు చెరిపేస్తున్నారు. వీళ్లలాగే ‘వైఫ్ ఆఫ్ రామ్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈగ, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ పూర్తి వైవిధ్యమైన కథాంశంతో.. తెరకెక్కించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ ఎలా ఉంది? మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా..? చూద్దాం.

పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. భర్త మరణించిన తర్వాత మర్డర్ కేసు మిస్టరీని చేధించడానికి భార్య చేసిన ప్రయత్నమే ‘వైఫ్ ఆఫ్ రామ్’. అసలు రామ్‌ను ఎవరు హత్య చేశారు? భర్త హత్య కేసును దీక్ష (మంచు లక్ష్మీ) ఎలా చేధించింది? అనేది చిత్ర కథాంశం. గతంలో దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ‘కహానీ’ మన ముందుకొచ్చింది. కానీ విజయ్ యలకంటి దానికి విరుద్ధమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఒక్క పాట కూడా లేకుండా.. ఓ మర్డర్ కేసు చేధించడమే స్టోరీగా విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ ఏంటో ముందే తెలియడంతో.. కథనమే సినిమాకు బలం. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది..? హంతకుడు ఎవరు? అనేదే సినిమాలో ప్రధానాంశం. ప్రేక్షకుడి మదిని ఆ ప్రశ్న తొలుస్తుంటే.. దర్శకుడు మాత్రం ఊహించని ట్విస్టుతో సినిమాను మలుపు తిప్పాడు. ఊహకందని రీతిలో సినిమా ముగియడంతో ఆడియెన్స్ బాగుందనే ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకొస్తారు.

భర్త హత్యతో వేదనకు గురైన భార్య పాత్రలో మంచు లక్ష్మీ చక్కగా నటించింది. పోలీసుల సాయం కోసం తిరిగి తిరిగి విసిగిపోయి.. ఇక లాభం లేదనుకొని తానే సొంతంగా విచారణ ప్రారంభిస్తుంది. కడుపులో బిడ్డను కోల్పోయినా, భర్త దూరమైనా.. న్యాయం కోసం పోరాడే ఒంటరి మహిళగా మంచు లక్ష్మీ శక్తిమేర నటించింది,

కానీ కథ మొత్తం తన చుట్టూ తిరిగే ప్రాధాన్యమున్న దీక్ష పాత్రలో ఆమె జీవిస్తే బాగుండేది. ప్రేక్షకుడికి దీక్ష మాత్రమే కనిపిస్తే.. సినిమా రేంజ్ మరోలా ఉండేది. దీక్షకు అండగా, విచారణలో సాయపడే పోలీస్ కానిస్టేబుల్ రమణ చారిగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. నెగటివ్ షేడ్ ఉన్న రాజ్ పాత్రలో ఆదర్శ్ నటించాడు. దీక్ష భర్త రామ్‌గా సామ్రాట్ రెడ్డి పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాలో కీలకం.

ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న డైరెక్టర్లు యూత్‌‌ను ఆకట్టుకునే లవ్ స్టోరీలు, బోల్డ్ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ విజయ్ యలకంటి మాత్రం ఢిపరెంట్ జానర్‌ను ఎంచుకున్నారు. థ్రిల్లర్‌గా వైఫ్ ఆఫ్ రామ్‌ను తెరకెక్కించారు. ఇలాంటి కథను హ్యాండిల్ చేసి మెప్పించడం పైకి కనిపించినంత తేలికేం కాదు.

చివరి వరకు కథనంపై గ్రిప్ కోల్పోవద్దు, టైం గడిచే కొద్దీ ఆసక్తి పెంచుతూ పోవాలి. చివర్లో సినిమా ఊహించని మలుపు తిరిగే ఆ మజానే వేరు. కొత్త దర్శకుడైనా.. విజయ్ ఈ విషయంలో విజయం సాధించారు. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారు.

పాటలు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్‌కి అసలేం పని ఉంటుందనుకోవచ్చు. కానీ థ్రిల్లర్ కథాంశంతో నడిచే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోరే బలం. రఘు దీక్షిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు మెరుగ్గా ఉన్నాయి. తమ్మి రాజు ఎడిటింగ్ వర్క్ బాగుంది.

కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ లేకున్నా, ఒక్క పాట కూడా లేకున్నా, చక్కటి థ్రిల్లర్ మూవీని కోరుకునే ఆడియెన్స్‌‌కు ఈ సినిమా నచ్చుతుంది. వైఫ్ ఆఫ్ రామ్‌, కహానీ చిత్రాల మధ్య పోలిక లేదు.

కానీ కథ సాగే తీరు స్థూలంగా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి నటన విషయంలో విద్యాబాలన్, మంచు లక్ష్మీ మధ్య పోలిక సహజంగానే వస్తుంది. భర్తను కోల్పోయిన మహిళ పాత్రలో విద్యాబాలన్ జీవించింది, మంచు లక్ష్మీ శక్తిమేర నటించింది. ఈ తేడా లేకుంటే సినిమా స్థాయి పెరిగేది.

Comments