రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌

రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌


 

Happy Wedding telugu movie review

రివ్యూ: హ్యాపి వెడ్డింగ్‌
రేటింగ్‌: 1.75 /5
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, రాజా, నరేష్‌, మురళీ శర్మ, పవిత్ర లోకేష్‌, ఇంద్రజ, అన్నపూర్ణ, తులసి తదితరులు
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
నిర్మాత: ఎమ్‌. సుమంత్‌ రాజు
దర్శకత్వం: లక్ష్మణ్‌ కార్య


టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకున్న మెగా డాటర్ హ్యాపీ వెడ్డింగ్ మీద ప్రేక్షకులకు ఓ మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి.

”ఒక మనసు” తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నీహారిక… ఈ సినిమా పై ముందు నుంచి పాజిటివ్ గా ఉంది. దానికి తోడు యూవీ సంస్థ లాంటి బ్యాక్ అప్ ఉండటంతో మార్కెటింగ్ బాగానే జరిగింది. సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన హ్యాపీ వెడ్డింగ్ ద్వారా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయమయ్యాడు.

అక్షర (నీహారిక) స్థిమితంగా ఏ నిర్ణయం తీసుకోలేని అమ్మాయి. ప్రతిదానికీ అయోమయం. తొలుత విజయ్ (రాజా) ను ప్రేమించి అతను తనను అర్థం చేసుకోలేదని ఆనంద్ (సుమంత్ అశ్విన్) వైపు టర్న్ అవుతుంది. తల్లితండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆనంద్ వ్యవహార శైలి అంతగా నచ్చకపోవడంతో తిరిగి విజయ్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ లోపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది.

మెగా డ్రామా పీక్స్ కు చేరుకున్నాక చివరికి ఎవరిని వరిస్తుందో అప్పుడప్పుడు సినిమాలు చూసే చిన్న పిల్లాడు సైతం ఈజీగా గెస్ చేయగలిగే క్లైమాక్స్.

సుమంత్ నటనలో చాలా మెరుగయ్యాడు. ఇందులో కూడా మంచి ఎనర్జీ చూపించాడు. ఆనంద్ పాత్రకు దర్శకుడు ఏం కోరుకున్నాడో అది పూర్తిగా ఇచ్చాడు. బరువైన సీన్స్ లో ఎమోషన్స్ చూపడంలో ఉన్న వీక్ నెస్ ని పోగొట్టుకుంటే మంచి నటుడిగా మారవచ్చు.

కథ అక్షర చుట్టే తిరుగుతుంది కాబట్టి…. జీవితంలో ఏది ఎలా నిర్ణయించుకోవాలో అర్థం కానీ, బయటికి కనిపించని తింగరి మనస్తత్వం ఉన్న పాత్రలో బాగా నటించింది. ఒక మనసుకు దీనికి ఆ తేడా గమనించవచ్చు. తన కన్ఫ్యూజన్ ని సమర్ధించుకునే పాత్రలో ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగానే ఇచ్చింది. బెస్ట్ అనలేం కానీ బెటర్.

సీనియర్ నటుడు నరేష్, మురళీశర్మ , పవిత్ర లోకేష్, తులసి హీరో హీరోయిన్ తల్లితండ్రులుగా రొటీన్ పాత్రలు చేసుకుంటూ పోయారు. హీరోయిన్ పిన్నిగా పెళ్లి కాని సైక్రియాటిస్ట్ పాత్రలో ఇంద్రజ బాగానే లాగించేసింది. నీహారిక ఫ్రెండ్ తెలంగాణ యాసతో కాసేపు ఆకట్టుకుంది. ఎక్స్ లవర్ గా రాజా మొక్కుబడిగా నటించేసాడు. వీళ్ళు తప్ప ఇంకెవరి ప్రస్తావన అవసరం లేదు. ఉన్నంతలో అన్నపూర్ణ చాలా నయం. తన డైలాగ్ టైమింగ్ తో నవ్వించారు.

దర్శకుడు లక్ష్మణ్ కార్య ఎంచుకున్న కథ చదవడానికి బాగుంటుంది కానీ రెండున్నర గంటల పాటు సినిమాకు పనికొచ్చే మెటీరియల్ అందులో లేదు. అక్షర లాంటి పాత్రలు ఇప్పటికే చాలా సార్లు చూసిన ప్రేక్షకులు ఎక్కడా కొత్తదనంగా ఫీల్ కారు. దానికి తోడు స్క్రీన్ ప్లే లోపం వల్ల ప్రతి సన్నివేశాన్ని సాగదీసినట్టుగా చూపడంతో పాటు…. సీరియల్ తరహాలో చూపించిన టేకింగ్ బాగా విసిగిస్తుంది.

పాత్రలకు మధ్య సంఘర్షణను ఎస్టాబ్లిష్ చేయకుండా అక్షర పాత్ర మీదే దర్శకుడు ఫోకస్ పెట్టడంతో హీరోతో సహా మిగిలిన పాత్రలు హెల్ప్ లెస్ గా కనిపిస్తాయి. నీహారిక యాక్టింగ్ టాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే లక్ష్మణ్ ఈ కథ రాసుకున్నాడేమో ఆయనకే తెలియాలి.

ఇద్దరు ప్రేమికులతో సిల్లీ రీజన్స్ తో బ్రేక్ చెప్పిన అక్షర… క్లైమాక్స్ లో అంత సిల్లీగా కన్విన్స్ అయినట్టుగా చూపడం ఏ మాత్రం అతకలేదు. కథ ఎంతకీ ముందుకు సాగకపోవడం సోల్ ని పూర్తిగా దెబ్బ తీసింది. ఎంతసేపూ బ్రేక్ అప్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు అక్షర పాత్ర ఇద్దరిలో ఒకరితో అయినా ప్రేమ ఎలా మొదలైందో అనేది చూపకపోవడం సానుభూతి రాకుండా చేసింది.

శక్తికాంత్ కార్తీక్ పాటలు మరీ చప్పగా ఉండగా… మొహమాటం కోసం ఒప్పుకున్న థమన్ ఏదో మొక్కుబడిగా పని కానిచ్చాడు. భవాని ప్రసాద్ సంభాషణల్లో ఎలాంటి ప్రత్యేకత లేదు. అన్నపూర్ణ పంచులతో కాసేపు నవ్వించాడు అంతే. బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. బడ్జెట్ సినిమా ఇది.

చివరిగా చెప్పాలంటే హ్యాపీ వెడ్డింగ్ థియేటర్ లో చూడాల్సి వచ్చే సింగల్ ఎపిసోడ్ మెగా సీరియల్. సాగతీతతో ప్రేమ కథను చూపించిన తీరు ఏ వర్గాన్ని ఆకట్టుకునేలా లేకపోగా నీహారిక పెర్ఫార్మన్స్ చూపించడం కోసమే దర్శకుడు కథ రాసుకున్నాడా అనే అనుమానం కలిగేలా చేస్తోంది.

ఫీల్ గుడ్ అంటే సాగదీసి తీయడం, ఎమోషన్ చూపడం అంటే పేజీల కొద్ది డైలాగులు చెప్పించి ప్రేక్షకులకు క్లాసు పీకడం అని ఎవరైనా చెప్పారో ఏమో కానీ లక్ష్మణ్ తీసిన హ్యాపీ వెడ్డింగ్ దానికి ఉదాహరణగా నిలుస్తుంది.

పేరులో వెడ్డింగ్ ఉంది కదా అని ఇదేదో సకుటుంబ సపరివార సమేత అని ఫీల్ అయిపోయి ఏవో అంచనాలతో వెళితే పప్పులో కాలేసినట్లే. ఇదో మతి తప్పిన అక్షర అనే పాత్ర చుట్టూ అల్లుకున్న డ్యూయల్ సిమ్ ప్రేమ కథ.

Comments